తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధాన అజెండాగా చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది.
సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలియజేస్తారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణంపై సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్‌ను సభలో ప్రకటించనున్నారు.
సభ వాయిదా అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహించి, సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సభకు విరామం ఇచ్చి, జనవరి 2న కృష్ణా జలాలపై, జనవరి 3న గోదావరి జలాలపై చర్చ జరగనుంది.
కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇందుకోసం నీటిపారుదల శాఖ అధికారులు సెలవు రోజుల్లోనూ కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ సహా కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్లు, గతంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పులు సేకరిస్తున్నారు.
ఈ ఆధారాలతో బీఆర్ఎస్‌పై అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.
ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజే సభకు వచ్చిన కేసీఆర్, తాజాగా మళ్లీ అసెంబ్లీకి రావడంతో సభ ఆసక్తికరంగా మారనుందని అంచనా వేస్తున్నారు.
ఇదే సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఏఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. సభలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక శాసనసభల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. సభలు సజావుగా సాగేందుకు పూర్తి భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

