తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి దాచుకున్న సొంత డబ్బులని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్య, విదేశీ చదువుల కోసం ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు ఈ నిధులు అందకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తూ చాలామంది ఉద్యోగులు మరణించారని, కొందరు ఆపరేషన్‌కు డబ్బులు లేవంటూ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి తెలంగాణపై పన్నాగం పన్నుతున్నారని బక్క జార్సన్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్‌కు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఆ కక్షతోనే చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ కుట్రలో భాగంగానే మొదటి దశలో హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల పేరుతో సెక్షన్ 144 అమలు చేశారని తెలిపారు. రెండో దశలో ‘కమిటెడ్ ఎక్స్‌పెండిచర్’ పేరుతో ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్లు, పీఆర్సీ, డీఏలను నిలిపివేశారని ఆరోపించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు 55% డీఏ, పీఆర్సీ అమలు చేస్తున్నా తెలంగాణలో మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

తెలంగాణకు ఆదాయ–వ్యయాలు లెక్కిస్తే నెలకు సుమారు ₹30 వేల కోట్లు మిగులుతాయని, అయినా రాష్ట్రం అప్పుల్లో ఉందని తప్పుడు ప్రచారం చేస్తూ ఆర్థిక ఎమర్జెన్సీకి ముహూర్తం పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

సీఎం తన నివాస మరమ్మతులకు ప్రభుత్వ ఖజానా నుంచి ₹3 కోట్లు వినియోగించారని, డిప్యూటీ సీఎం తన కుమారుడి ఎంగేజ్మెంట్‌ను ప్రజాభవన్‌లో ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగమేనని అన్నారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకే విగ్రహాల వివాదాలను ముందుకు తెస్తున్నారని, అసలు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు కాలరాస్తే సహించబోమని హెచ్చరిస్తూ, ఈ వ్యవహారంపై ప్రజా ఉద్యమం తప్పదని బక్క జార్సన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *