తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 11 మంది ఎంపీల్లో చామల మల్లు మాత్రమే కొంతవరకు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని, మిగతావారి పాత్ర అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది.
రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, అనిల్ కుమార్ వంటి ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సీనియర్ ఎంపీలు బలరాం నాయక్, సత్కార్ కూడా ప్రజా సమస్యలపై పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాలకు పరిమితమైన రేణుక చౌదరి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు ఎనిమిది మంది లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ, పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై గట్టిగా మాట్లాడిన దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా తరహా అంశాలపై పార్లమెంట్ వేదికగా ఒత్తిడి తేవాల్సిన ఎంపీలు మౌనం పాటిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించడంలోనూ, బీజేపీతో పాటు ఇతర విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలోనూ ఎంపీలు విఫలమవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా పరిస్థితిలో మార్పు లేదని పార్టీ నేతలు అంటున్నారు.
హైడ్రా పాలసీ, గ్లోబల్ సమిట్, పెట్టుబడుల అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ఎంపీలు ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వకపోవడం పార్టీకి నష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రమే మీడియా ముందు మాట్లాడటం సరికాదని, ఫస్ట్ రియాక్షన్ ఎంపీల నుంచే రావాలని డిమాండ్ పెరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో రాబోయే మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎంపీల పనితీరుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో, మార్పులు తప్పవన్న అభిప్రాయం బలపడుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఈ 11 మంది ఎంపీల పేర్లు పరిగణనలో ఉంటాయా? లేక పూర్తిగా పక్కన పెట్టి కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

