తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది.
గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ విచారణ జరిపి ఫలితాలను రద్దు చేస్తూ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ లేదా రీమెయిన్స్ నిర్వహించాలని సూచిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)తో పాటు ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం, పరీక్షల నిర్వహణ పారదర్శకంగానే జరిగిందని తేల్చి చెప్పింది. బయోమెట్రిక్ విధానం, మూల్యాంకన ప్రక్రియలో లోపాలున్నాయన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
అవకతవకలు జరిగాయని నిరూపించే ఆధారాలు లేనందున సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో మధ్యంతర ఉత్తర్వుల అనంతరం ప్రభుత్వం 562 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని అప్పట్లో కోర్టు పేర్కొనగా, తాజాగా ఇచ్చిన తుది తీర్పుతో వారు త్వరలోనే విధుల్లో చేరనున్నారు.
ఈ తీర్పుతో గ్రూప్ వన్ అభ్యర్థుల్లో భారీ ఊరట వ్యక్తమవుతోంది. న్యాయపోరాటంలో విజయం సాధించామని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రూప్ వన్ నియామకాలపై నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠకు ముగింపు లభించింది.
హైకోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఉద్యోగ నియామకాలను అడ్డుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం తీర్పుతో 563 మంది గ్రూప్ వన్ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గ్రూప్ వన్ అధికారులుగా మీరు నియమితులవుతున్నారని పేర్కొంటూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితమవ్వాలని సీఎం పిలుపునిచ్చారు.

