మొంతా ప్రభావం: హైదరాబాద్ సహా తెలంగాణలో అతి భారీ వర్షాలు – వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

మొంతా తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఆగ్రహం ప్రదర్శిస్తోంది. ప్రత్యేకంగా రాజధాని హైదరాబాద్‌లో రాత్రి నుంచే భారీ వర్షాలు కురవడంతో నగరం తడిసిముద్దైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచే వర్షం కురవడంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) తాజా హెచ్చరిక మేరకు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. వచ్చే కొన్ని గంటల్లో 180మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రేపటికీ భారీ వర్షాల సూచనతో యెల్లో అలర్ట్ ఇచ్చారు.

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎల్‌బీ నగర్, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు భారీగా ఇబ్బందులు పడుతున్నారు.

తుఫాను ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో అదిలాబాద్, కొమరంభీం-అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పేద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి-భువనగిరి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ వంటివి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 80మి.మీ నుంచి 180మి.మీ వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం వేళల్లో పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం కూడా ఉంటుందని ఐఎండి హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉన్నపుడే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *