తెలంగాణ రాష్ట్ర గీతం “జయహో తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందేశ్రీ ఇకలేరు. ఈరోజు ఉదయం 7.25 గంటలకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు.
అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్తలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, “జయహో తెలంగాణ” గీతం ద్వారా లక్షలాది మందికి ప్రేరణనిచ్చిన వ్యక్తిగా అందేశ్రీ గుర్తింపుపొందారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందేశ్రీకి కోటి రూపాయల పురస్కారం ప్రకటించింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆయనకు 2006లో “గంగా” సినిమాకు నంది పురస్కారం, 2014లో గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దశరధి సాహితీ పురస్కారం మరియు రావోరి భగద్వాజ్ సాహితీ పురస్కారం, 2022లో జనకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించాయి.
గాంధీ హాస్పిటల్ వైద్యుల ప్రకారం, అందేశ్రీ హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించారు. ఆయనకు గత ఐదేళ్లుగా హైపర్టెన్షన్ ఉన్నప్పటికీ, గత ఒక నెల రోజులుగా మందులు వాడడం లేదని వైద్యులు తెలిపారు. రాత్రి భోజనం తర్వాత సాధారణంగా నిద్రపోయి, ఉదయం బాత్రూం దగ్గర కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అందేశ్రీ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు గాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందేశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని ఆదేశించారు. ఆయన సాయంత్రం 5 గంటల లోపు అంత్యక్రియలు జరగనున్నాయి.
తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గీతకారుడు, ప్రజా కవి, సాహితీ జగత్తుకు గర్వకారణమైన అందేశ్రీ లేని లోటు ఎప్పటికీ తీరదని రాష్ట్రవ్యాప్తంగా సాహితీ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతాయని సాహితీ వేత్తలు పేర్కొన్నారు.

