మూడు దశాబ్దాలుగా విద్యావ్యవస్థలో కొనసాగుతున్న అవినీతి, స్కాలర్షిప్ నిధుల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ విద్యా సంస్థల్లో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పక్కదారి పడకుండా విజిలెన్స్ దర్యాప్తు బృందాలు పనిచేయనున్నాయి.
ప్రభుత్వం ఆదేశాల మేరకు,
- రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు,
- సిఐడి,
- ఏసీబీ,
- ఇంటెలిజెన్స్ శాఖలు
విద్యాశాఖతో కలిసి పని చేయనున్నాయి. కాలేజీల్లో మౌలిక సదుపాయాల లోపాలు, విద్యార్థులపై విధించే అక్రమ ఛార్జీలు, అకౌంట్ పారదర్శకతపై ప్రత్యేక పరిశీలన జరగనుంది. తనికీల అనంతరం నివేదిక ప్రభుత్వానికి సమర్పించబడుతుంది.
అయితే ఈ ఆదేశాల నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా ముదురుతున్నాయి. ప్రతిపక్షాలు మరియు కొంతమంది విద్యాసంస్థలు ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు ₹850 కోట్ల వరకు నిలిపివేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తనికీలు పేరుతో కాలేజీలను ఇబ్బందిపెట్టే ప్రయత్నమా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బకాయిలు క్లియర్ చేయకపోతే నిరసనలు, బంద్ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా, పారదర్శకత నిజంగా లక్ష్యమైతే ప్రభుత్వం తక్షణ బకాయిల విడుదల చేసి, ఆపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం నిపుణులది. విద్యాశాఖ చర్యలు నిజంగా విద్యార్థుల ప్రయోజనానికేనా? లేక యాజమాన్యాలపై ఒత్తిడి సాధించడానికేనా? అన్నది కాలమే నిర్ణయించాలి

