TSPSC 1036 ఉద్యోగాల రద్దుపై నిరుద్యోగుల ఆవేదన: న్యాయం ఎక్కడ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఆశలతో సంవత్సరాల పాటు పోరాడుతున్న నిరుద్యోగులకు మరోసారి గట్టి దెబ్బ పడింది. గ్రూప్-టికి సంబంధించిన 1036 ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు తాజాగా రద్దు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బాధిత అభ్యర్థులు ఈరోజు హైదరాబాద్‌లో మీడియా ముఖాముఖి పెట్టి తమ వేదనను వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల ప్రతినిధి ఇంద్ర నాయక్ మాట్లాడుతూ, “ఈ పోస్టుల నోటిఫికేషన్ 2015లో వచ్చింది… పరీక్ష 2016లో జరిగింది… రిజల్ట్స్ 2019లో ఇచ్చారు… 2020లో అపాయింట్‌మెంట్ ఇచ్చి, ఇప్పుడు 2025లో సెలెక్షన్ లిస్ట్ రద్దు అంటున్నారు. ఇది న్యాయమా?” అని ప్రశ్నించారు.

అతడు TSPSC చేసిన కీలక తప్పిదాన్ని వివరించాడు. పరీక్ష సమయంలో OMR షీట్‌లో ‘వైట్‌నర్’ ఉపయోగాన్ని అధికారులు స్వయంగా అనుమతించడం వల్లే కొంతమంది అభ్యర్థులు పొరపాటు చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఆ సాంకేతిక లోపాన్ని అభ్యర్థులపై మోపడం ఎంత న్యాయం? అని వారు ప్రశ్నించారు.

“తప్పు TSPSC చేసింది, శిక్ష మాత్రం నిరుద్యోగులకు పడుతోంది”, అని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాల్లో UPSC, SSC లేదా RRB పరీక్షలు జరిగినా ఈ తరహా రద్దులు, కేసులు రావు కానీ TSPSC మాత్రమే రాజకీయ ప్రభావంతో నడుస్తుందని అభ్యర్థులు ఆరోపించారు.

ఇంద్ర నాయక్ ఇంకా మాట్లాడుతూ—

“మేము మోసపోయాం. మా భవిష్యత్తు, మా పదేళ్లు, మా సప్నాలు కోర్టుల్లో కేసుల మధ్య నశించాయి. ప్రభుత్వం గాని, TSPSC గాని మాకు న్యాయం చేయాలి” — అన్నారు.

ఇంకా ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఆడపిల్లలకు స్కూటీలు, లక్షల ఉద్యోగాలు వస్తాయి” అని చెప్పడం మాటల్లోనే ఉందని అన్నారు.

ఇంకా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ—

“ఉద్యోగం వచ్చేవాడైనా… రాని వాడైనా… అందరూ తెలంగాణ బిడ్డలమే. తప్పు TSPSCది, కానీ పోరాడేది నిరుద్యోగులే. ఇది ఎంతకాలం?” — అని ప్రశ్నించారు.

అంతేకాదు, భవిష్యత్తులో గ్రూప్-1 పరీక్షలు కూడా ఇలాగే రద్దయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

వారి డిమాండ్ స్పష్టంగా ఉంది:

  • తప్పు చేసిన అభ్యర్థులను మాత్రమే రద్దు చేసి
  • తదుపరి మెరిట్‌లో ఉన్నవారికి అవకాశం ఇవ్వాలి
  • TSPSC పూర్తిగా స్వతంత్రంగా పనిచేయాలి
  • ఉద్యోగ నియామకాలకు రాజకీయ జోక్యం లేకుండా చూడాలి

ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాల్సిన సమయం వచ్చిందని నిరుద్యోగులు స్పష్టం చేశారు. “మా పోరాటం కొనసాగుతుంది — న్యాయం వచ్చే వరకు ఆగం” అని నేతలు ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *