తెలంగాణ ఎన్నికల దశలో ఓటర్ జాబితా సక్రమతపై మళ్లీ చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగనూర్ కాలనీలో జరిగిన ఓ సంఘటన స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 80 గజాల చిన్న ఇల్లు, గృహనెంబర్ 101, బూత్ నెంబర్ 125లో ఉన్న ఓ ఇంటి మీదే 26 ఓట్లు నమోదైనట్టు సమాచారం.
ఆ ఇంటి యజమాని నారాయణ గారు క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన మాటల ప్రకారం తనకు ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే నివసిస్తున్నారని, మిగతా ఓటర్లు ఎవరో తానుకూడా గుర్తు పట్టలేకపోతున్నానని తెలిపారు. ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, “నాకు ఈ ముఖాలు ఎవరూ గుర్తు లేరు. నా ఇంటిపై ఎట్లా ఇన్ని ఓట్లు వచ్చాయో తెలియదు,” అని చెప్పారు.
స్థానిక కేబుల్ ఆపరేటర్ మాట్లాడుతూ, తాను ఈ కాలనీలో 25 ఏళ్లుగా పని చేస్తున్నానని, కానీ ఈ జాబితాలో ఉన్న 26 మంది ఓటర్లలో ఒక్కరినీ కూడా ఎప్పుడూ చూడలేదని తెలిపారు. “ఈ 60–80 గజాల ఇల్లు మీద ఇంతమంది ఓట్లు ఉంటే, ఇంకెన్ని ఇళ్లలో ఇలా ఉన్నాయో ఆలోచించాల్సిందే,” అని ఆయన అన్నారు.
జిహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సరిచూసి, వాస్తవంగా ఆ చిరునామాలో వారు ఉన్నారో లేదో ధృవీకరించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 400 బూతులు ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి తప్పుల వలన వేలాది తప్పుడు ఓట్లు నమోదు అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఓటర్ జాబితాలో తప్పుడు నమోదు జరిగిందనే ఆరోపణలపై సంబంధిత అధికారులు దర్యాప్తు జరిపి, వాస్తవ పరిస్థితులు బయట పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

