బాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు నటులు హాలీవుడ్లో తమ ప్రతిభను చూపించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ వంటి స్టార్లు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో భాగమై రాణించారు. ఇప్పుడు వారి జాబితాలో మరో పేరు చేరబోతోంది — విద్యుత్ జమ్వాల్.
అద్భుతమైన ఫిట్నెస్, యాక్షన్ స్టైల్, స్టంట్స్‌తో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యుత్… ఇప్పుడు హాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్దమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా రూపొందుతున్న అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ లో కీలక పాత్రను పోషిస్తున్నారు.
కిటావో సకురాయి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ నుండి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్… సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అందులో విద్యుత్ జమ్వాల్ ‘ధల్సిమ్’ పాత్రలో కనిపిస్తున్న తీరు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తి హెయిర్ షేవ్, యోగి స్టైల్ లుక్ తో ఆయన చేసిన మేకోవర్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
ధల్సిమ్ పాత్ర వీడియో గేమింగ్ ప్రపంచంలో ఐకానిక్. ఈ పాత్రకు అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్, యాక్షన్ ఫ్లూయిడిటీ, బాడీ కంట్రోల్ వంటి లక్షణాలు విద్యుత్‌లో సహజంగానే ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “ధల్సిమ్ పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
హాలీవుడ్లో విద్యుత్ జమ్వాల్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, భారతీయ సినిమా ప్రతిష్టను ప్రపంచానికి తీసుకెళ్లాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
స్ట్రీట్ ఫైటర్ సినిమాలో విద్యుత్‌తో పాటు నోహా సెంల్టినియో, ఆండ్రూ కోజీ, కాలినా లియాంగ్, రోమన్ రేన్స్, డేవిడ్ డాస్ట్‌మాల్చియన్, కోడి రోడ్స్, ఆండ్రూ షుల్జ్, ఎరిక్ ఆండ్రే, జేసన్ మొమోవా వంటి హాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధల్సిమ్ పాత్రలో విద్యుత్ ఎలా మెప్పిస్తారో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

