తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు.
గతంలో కవిత బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆమె మాటలు, వ్యవహారశైలిపై పలుమార్లు ఖండించామని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో బయటికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు.
సంతోష్ రావు అంశాన్ని లాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే స్పష్టమైన ఆధారాలు ఉండాల్సిందేనని, కేవలం రాజకీయ ఆరోపణలతో చర్యలు ఉండవని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాపాలనను అమలు చేస్తోందని, ఆ పాలనకు అడ్డుగా నిలిచే ప్రయత్నాలు జరిగితే గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకల్ని కవితే బట్టబయలు చేస్తున్నారని, ఆ అంశాల్లో నిజం బయటకు రావడం తప్పదని వ్యాఖ్యానించారు.
అయితే వ్యక్తిగత సమస్యలు, కుటుంబ అంతర్గత వ్యవహారాలను ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేస్తే అదే స్థాయిలో రాజకీయంగా ప్రతిస్పందన తప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

