చలికాలంలో మార్నింగ్‌ వాకింగ్‌.. మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!

చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో మార్నింగ్‌ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. కానీ చలికాలంలో ఉదయపు నడక గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలి ఎక్కువగా ఉండే సమయంలో శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల రక్తపోటు పెరిగి గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ పరిస్థితుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కాలుష్యం, పొగమంచు అధికంగా ఉండే ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేయడం మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

అధిక రక్తపోటు ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు చలికాలంలో ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రిస్క్ గ్రూప్‌లో లేని వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ నడక చేయవచ్చు.

ఉదయం 6–7 గంటల మధ్య నడకకు వెళ్లడం కంటే సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం వేళ నడవడం మంచిది. తల, చెవులు, ఛాతీ భాగాలను కప్పే వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలి. వేగంగా నడవడం, జాగింగ్ చేయడం మానుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటే ఇండోర్ వాకింగ్‌ ఉత్తమం.

నడుస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి, అధిక చెమట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాకింగ్ ఆపి వైద్యులను సంప్రదించాలి. చలికాలంలో జాగ్రత్తలతో నడక చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *