కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.
సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది. ఆర్టీఏ అధికారులు కూడా కరప్ట్ అయ్యారు. వందల కోట్ల రూపాయలు ప్రతి నెలా ప్రభుత్వానికి నష్టం కలుగుతోంది” అని వ్యాఖ్యానించారు.

ఆయన గుర్తుచేస్తూ చెప్పారు — 12 సంవత్సరాల క్రితం జరిగిన బెంగళూరు బస్ ప్రమాదం తర్వాత కూడా పరిస్థితులు మారలేదని, అదే రీతిలో ఫిట్నెస్ లేని బస్సులు, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న వాహనాలు ఇంకా వీధుల్లో తిరుగుతున్నాయని తెలిపారు. “ఇది మొత్తం ట్రావెల్స్ మాఫియా నడిపించే వ్యవస్థ. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు” అన్నారు.

అదేవిధంగా, డ్రైవర్ల తగిన శిక్షణ లేకపోవడం, బస్సుల్లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అధిక స్పీడ్‌ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. “ప్రైవేట్ ట్రావెల్స్‌ను తక్షణమే బ్యాన్ చేయాలి. అన్ని బస్సులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. లేకుంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవు” అని సుధాకర్ గారు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్ ఎదురవుతున్నది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారా, లేక మళ్లీ కేసు పాతదే అవుతుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *