సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కోట నీలిమగారు మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజల పార్టీ. బీఆర్ఎస్‌లా ఇది కుటుంబ పార్టీ కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మేము జవాబుదారీ నాయకులం,” అని స్పష్టం చేశారు.
అలాగే ఆమె గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అన్నారు — “గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉంది. అందుకే పథకాలు కొంచెం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కానీ మేము ఇచ్చిన మాట తప్పం, ప్రతి పథకం అమలవుతుంది. ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తప్పక తీసుకుంటాం,” అని నమ్మకంగా తెలిపారు
నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ ప్రజల విజయం అవుతుంది,” అని ఆమె అన్నారు.
అలాగే సనత్‌నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు పక్కపక్కనే ఉన్నందున రెండు ప్రాంతాల మధ్య సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “మన ప్రాంతాలు పక్కపక్కనే ఉన్నాయి. కాబట్టి మనం కూడా పక్క పక్కన నడుస్తూ, పరస్పరం సాయపడుతూ ముందుకు సాగాలి. అభివృద్ధి అంటే సమన్వయం, అదే కాంగ్రెస్ ఆలోచన,” అని కోట నీలిమగారు వివరించారు.
ఆమె ప్రసంగానికి స్థానిక ప్రజలు మంచి స్పందన ఇచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని “జై కాంగ్రెస్!”, “జై తెలంగాణ!” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్యకర్తలు కూడా పాల్గొన్నారు

