రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు: కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరింది

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శ కోసం కాదు కానీ వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీని కేసీఆర్ తానే అంతమొందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి సానుభూతి కలిగించే స్థాయికి చేరిందని, ఆయనను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు.

జూబిలీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజలకు విజ్ఞప్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్య కారణాలు ఉండవచ్చని అంగీకరించినప్పటికీ, కనీసం అభ్యర్థిని గెలిపించాలని కూడా కోరకపోవడం ఆయన మనసులో ఉన్న ఆవేదనను చూపుతోందన్నారు. కేసీఆర్ కళ్ళముందే పార్టీ కూలిపోతుండగా, ఆయన నిరాశతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్లే బీజేపీకి లాభం కలిగిందని అన్నారు. “బీఆర్ఎస్ బీజేపీకి బలంగా సహకరించింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసిపోయే దశకు వచ్చాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా “బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ మొదలైంది” అని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇక జూబిలీహిల్స్ ఉపఎన్నికపై మాట్లాడుతూ, బీజేపీకి ప్రజల్లో నమ్మకం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. “బీజేపీ నాయకులు పిక్నిక్ మూడ్‌లో తిరిగారు, ఎక్కడా ప్రజలతో కలిసే ప్రయత్నం చేయలేదు. అందుకే ఫలితాలపై ఆశలు వదిలేశారు” అని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇటల రాజేందర్ వంటి నేతలు సరిగా ప్రచారం చేయలేకపోయారని ఆయన విమర్శించారు.

ఇదిలా ఉండగా, జూబిలీహిల్స్ ఉపఎన్నికలో భారీ స్థాయిలో డబ్బు ప్రవాహం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. “పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. బలహీన ప్రాంతాల్లో మరింత రెట్టింపు తాయిలం జరుగుతోందని” ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో ఉపఎన్నిక వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న ఈ ట్రైయాంగిల్ పోరులో రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు రాజకీయంగా ప్రధాన చర్చగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *