తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం మరింతగా ఉధృతంగా మారుతోంది. తాజాగా సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ సంఘటనను తీన్మార్ మల్లన్న, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ఆత్మహత్య ప్రయత్నం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని వారు మండిపడ్డారు. ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ చెప్పి, ఎన్నికల తర్వాత మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి నేరుగా బాధ్యుడని నేతలు ఆరోపించారు.
మల్లన్న మాట్లాడుతూ—
“బీసీ యువకులు ఇలా తమను తాము నిప్పంటించుకోవాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదు. బీసీలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. సాయి కుటుంబానికి మేము అండగా ఉంటాం,” అని స్పష్టం చేశారు.
ఘటన తర్వాత సాయి ఈశ్వరాచారి కుటుంబం, బీసీ సంఘాలు, స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీసీలను మోసం చేస్తూ రాజకీయాలు చేస్తున్న పార్టీలే ఇలాంటి పరిణామాలకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాయి భార్య, పిల్లల పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. “బీసీల కోసం పోరాడానని ఆయన చెప్తూ వెళ్ళాడు. రాజకీయ నాయకులు మా వారిని ఇలా నిస్సహాయ స్థితిలోకి నెట్టేశారు,” అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై మాట్లాడుతున్నారు.
ఈ ఘటన తర్వాత బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ ఉద్యమం మరింత వేగం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

