రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గృహ నిర్మాణ శాఖ రెండు సంవత్సరాల ప్రగతిని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని, ఇంకా మూడు లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇండ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, జూన్ నాటికి మరో రెండు లక్షల గృహ ప్రవేశాలు పూర్తవుతాయని ప్రకటించారు. జిహెచ్ఎంసీ పరిధితో సహా పట్టణాలన్నింటిలో ఇండ్ల మంజూరు ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు.
జీఆర్+3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణానికి కొత్త పాలసీ త్వరలో విడుదల కానుందని, మధ్యతరగతి ప్రజలకు లాభనష్టాలు లేకుండా అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ రూపకల్పనలో ఉందన్నారు. ఇందుకోసం ఓఆర్‌ఆర్ చుట్టూ నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసి, ఒక్కో ప్రాంతంలో 8,000–10,000 ఇండ్ల నిర్మాణ ప్రతిపాదన ఉందని తెలిపారు.
గతంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు పాడైపోయిన నేపథ్యంలో, వాటిని తొలగించి హైరైస్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణంపై ఆలోచన జరుగుతోందని చెప్పారు.
గత ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన టూ బిఎచ్‌కే ఇండ్ల నిర్మాణాన్ని 700 కోట్ల రూపాయలతో పూర్తిచేశామని, మరో 200 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. బోర్డు పరిధిలో అక్రమంగా ఆక్రమించబడిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని హైలైట్ చేశారు.
గతంలో ఉపేక్షకు గురైన గృహ నిర్మాణ శాఖను పునర్‌వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకున్నామని, 394 మంది డీఈలను తిరిగి రప్పించడంతో పాటు కొత్తగా 800 మంది ఏఈలను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించామని వెల్లడించారు.
హిల్ట్ పాలసీపై బిఆర్ఎస్ విమర్శలకు స్పందన
బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను మంత్రి పొంగులేటి తీవ్రంగా ఖండించారు. హిల్ట్ పాలసీ పత్రంపై కేటీఆర్ స్వయంగా సంతకం చేశారని, ఆ పాలసీకి మూలం గత ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గతంలో వేలంల ద్వారా కోకాపేట్, నియా పాలసీ ఫ్లాట్లను విక్రయించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు.
“ప్రభుత్వ భూముల వేలంలో గత ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఎకరాలు అమ్మింది. ఇప్పుడు మాకు విమర్శలు చేయటానికి నెపమేమిటి?” అని మంత్రి ప్రశ్నించారు.

