అమెరికాలో హెచ్1బి, హెచ్4 వీసాదారులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొందరు విదేశీ ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్ల ద్వారా సమాచారం పంపింది. ఈ నిర్ణయం భారతీయ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా ప్రభుత్వం హెచ్1బి, హెచ్4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసిన అమెరికా అధికారులు, దరఖాస్తుదారులతో పాటు వారి కుటుంబ సభ్యుల గత ఐదేళ్ల సోషల్ మీడియా వివరాలను ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు వీసాలు ఉన్నవారినీ అదే విధంగా అడిగే అవకాశముందని ఇమిగ్రేషన్ న్యాయ నిపుణులు వెల్లడించారు.
వీసాలు తాత్కాలికంగా రద్దైనప్పటికీ, వాటి గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చని హ్యూస్టన్‌కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమాన్యుయెల్ సుమన్ తెలిపారు. అయితే దేశం బయటకు వెళ్లి తిరిగి అమెరికాకు రావడం మాత్రం సాధ్యం కాదని రెడ్డి న్యూమన్ ప్రౌడ్ పీసీ అనే ఇమిగ్రేషన్ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసర పనుల కోసం భారత్‌కు రావాల్సి వచ్చినా, తిరిగి అమెరికా వెళ్లడం కష్టసాధ్యమవుతుందని హెచ్చరించింది.
ఈ నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయేది భారతీయులేనని వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్1బి, హెచ్4 వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉండటంతో, వారి ఉద్యోగాలు, కుటుంబ జీవితం, భవిష్యత్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. తిరిగి అమెరికా వెళ్లాలంటే సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి రావడంతో పాటు కొత్త వీసా పొందినంత పని అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఒకవైపు హెచ్1బి, హెచ్4 వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటూ, మరోవైపు ట్రంప్ ప్రభుత్వం భారత్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించడం అనుమానాలకు దారి తీస్తోంది. ట్రంప్ మీడియా సంస్థ పెట్టుబడులపై కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు రాజకీయ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీసాల రద్దులు, విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం నిజంగా భారత్‌పై మమకారంతో పెట్టుబడులు పెడుతుందా? లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.

