గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చైతన్యంతో తమ ఓటును తమ వారికే వేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బై శేఖర్ పిలుపునిచ్చారు. బాల్గొని బాలరాజ్ గౌడ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8168 గ్రామాల్లో ఎన్నికలు జరగగా, అందులో 811 గ్రామాల్లో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏకగ్రీవ స్థానాలను ఆధిపత్య వర్గాలు వేలంపాటలుగా మార్చి, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలన్నీ కలిసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
మొదటి, రెండో విడత ఎన్నికల్లో బీసీలు 49 నుంచి 50 శాతం పైగా స్థానాలు గెలుచుకోవడం ప్రజల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనమని అన్నారు. రేపు జరగబోయే మూడో విడతలో 4567 గ్రామాల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యంగా నిలిచి 50 శాతం పైగా విజయం సాధించాలని కోరారు.
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు, ఉద్యమకారులు, కవులు, కళాకారుల విగ్రహాలకు అనుమతి ఇవ్వని పాలకులు, రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడం దుర్మార్గమైన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని అన్నారు.
2028లో బీసీల రాజ్యాధికార లక్ష్యంతో ప్రతి ఓటు కీలకమని, ఓటు తల్లితో సమానమని పేర్కొన్నారు. డబ్బులకు ఓటును అమ్ముకుంటే ఐదు సంవత్సరాల పాటు నష్టపోతామని హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో బీసీ–ఎస్సీ–ఎస్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాల్గొని బాలరాజ్ గౌడ గారికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

