రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరుగుతూ రాజకీయ ప్రచారం చేస్తున్నారని, అదే సమయంలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇందిరమ్మ ఇళ్లు రావు… ఈ పథకం రాదు… ఆ పథకం రాదు” అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని గ్రామ గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నా కూడా నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం వరకు ఫలితాలు మారేవని, అయినప్పటికీ 35 నుంచి 40 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందంటే దానికి కారణం కార్యకర్తల పోరాట స్ఫూర్తేనని నేతలు అంటున్నారు. ఈ పోరాటమే పార్టీ నాయకత్వానికి కొత్త ఉత్సాహం ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ముత్యమంటలు పెట్టినట్టయ్యిందని వ్యాఖ్యానిస్తున్నారు.
అందుకే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలన్న డిమాండ్‌కు కూడా ప్రభుత్వం తప్పించుకుంటోందని విమర్శలు ఉన్నాయి. నిజంగా రైతులకు ఏమైనా మంచి చేసి ఉంటే, జాతీయ రైతు దినోత్సవం రోజైనా సహకార సంఘాల ఎన్నికలు ప్రకటించాల్సిందని రైతు నేతలు ప్రశ్నిస్తున్నారు.
నల్లగొండ వేదికగా మాట్లాడిన నేతలు, “ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే, సహకార ఎన్నికలు పెట్టాలి” అని ముఖ్యమంత్రిని నేరుగా డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో నామినేటెడ్ పదవుల ద్వారా కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారని, కానీ రాష్ట్రంలోని రైతులు, రైతు కూలీలు తీవ్రమైన కోపంతో ఉన్నారని హెచ్చరించారు. ఆ కోపం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో బయటపడిందని తెలిపారు.
రెండేళ్లు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేదని, రోజుకొక లీక్, రోజుకొక కేసు అంటూ కాలక్షేపం రాజకీయాలే నడుస్తున్నాయని విమర్శించారు. కేసులు పెట్టే ధైర్యం కూడా లేదని, కెమెరాల ముందు నిలబడి స్పష్టంగా మాట్లాడే సత్తా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? అని నిలదీస్తున్నారని, అందుకే ప్రభుత్వం రోజూ ఏదో ఒక డైవర్షన్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇక ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ప్రజలకు వివరించారని నేతలు గుర్తు చేశారు. డీపీఆర్ ఆధారంగా తెచ్చిన అనుమతులను తిరిగి పంపడం ద్వారా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ అంశాలపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం, కేసీఆర్‌పై కేసులు పెడుతున్నామంటూ లీకులు ఇచ్చి, పత్రికల్లో పెద్ద అక్షరాలతో “నోటీసులు” అంటూ వార్తలు రాయించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, రెండేళ్ల పాలన విజయోత్సవాల వెనుక ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల భయం, రైతుల ఆగ్రహం దాగి ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. సహకార ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది.

