ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రావు ప్రభాకర్ రావును తాజాగా సిట్ అధికారులు విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పేర్కొంటూ, మరింత కస్టడీ అవసరమని కోర్టును ఆశ్రయిస్తూ మరోసారి రిమాండ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీ గడువు మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీస్ అధికారులతో ఆయనను ముఖాముఖి విచారణకు సిట్ సిద్ధమవుతోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ సభ్యులు, అప్పటి ఉన్నత ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్ఐబీ అధికారులను ఇప్పటికే సిట్ ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేసి, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను క్రోడీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో తప్పుడు ఉద్దేశాలతో, వ్యక్తుల గోప్యతను ఉల్లంఘించేలా నాటి ఎస్ఐబీ అధికారులు వ్యవహరించారనే ఆరోపణలకు సంబంధించి పలు సాక్ష్యాలు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ అవుతాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాన్ని సిట్ బృందం అధికారికంగా నిర్ధారించడం లేదు. దిగువ స్థాయి విచారణ ఇంకా పూర్తిస్థాయికి చేరలేదని, ఆదేశాలు ఎవరు ఇచ్చారనే అంశాన్ని స్పష్టంగా నిర్ధారించడానికి ఇంకా సమయం పడుతుందని పోలీసులు అంతర్గతంగా చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతానికి నోటీసుల జారీపై తొందరపాటు నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను వాచ్‌లిస్ట్‌లో చేర్చి రివ్యూ కమిటీకి పంపిన వ్యవహారంలో ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి? అందుకు ఉన్నతాధికారుల ప్రమేయం ఎంత వరకు ఉంది? వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అనే అంశాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఫోన్ సంభాషణలు లేదా వాట్సాప్ చాట్స్ ద్వారా ఆదేశాలు అందాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకోసం కోర్టు అనుమతితో కొంతమంది సీనియర్ అధికారుల ఫోన్లను పరిశీలించే యోచనలో సిట్ ఉన్నట్లు సమాచారం.
రివ్యూ కమిటీకి ప్రపోజల్స్ వెళ్లే ముందు రెండు దశల్లో జరగాల్సిన పరిశీలనలో తీవ్ర గోల్మాల్ జరిగినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ గత ట్రాక్ రికార్డ్‌పై పూర్తిగా నమ్మకం ఉంచి, అనుమానించకుండా అనుమతులు ఇచ్చారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్, అనిల్ కుమార్, ప్రభాకర్ రావుల మధ్య జరిగిన సంభాషణలు బయటకు వస్తే దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావుల వాంగ్మూలాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, వాటి ఆధారంగా వెంటనే నోటీసులు జారీ చేయడానికి పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ మాజీ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ అధికారులు కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అయితే నేరం జరిగిందని నిరూపించే ప్రాథమిక ఆధారాలు లభించినా, నేరానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే అంశాన్ని ఖచ్చితంగా రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలు అవసరమని అధికారులు చెబుతున్నారు.
నిందితులు ముందే ప్రణాళికాబద్ధంగా ఆధారాలను ధ్వంసం చేసిన అవకాశముందని, అందుకే పక్కా సాక్ష్యాలు సేకరించడానికి సమయం పడుతోందని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్స్ వంటి డిజిటల్ ఆధారాలు లభిస్తే కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, వచ్చే ఏడాది (2026) జనవరిలో నోటీసులు జారీ చేసే దిశగా సిట్ ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ, పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంటుండగా, మరిన్ని ఆధారాలు బయటకు వస్తే రాజకీయంగా పెను దుమారం చెలరేగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

