ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ దుమారం మరింత ఉధృతమవుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, కేసులు మాకు లెక్కే కాదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని స్పష్టం చేశారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తనపై లెక్కలేనన్ని కేసులు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తారంటూ కావాలని లీకులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇరుకున పడిన ప్రతిసారి ఇదే తంతు పాటిస్తూ కేసులు, లీకుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తు భయం పట్టుకుందని, గేట్లు, రూట్లు మార్చినప్పటికీ కలిసి రాలేదన్న భావనతో సచివాలయానికి రావడమే మానేశారని ఎద్దేవా చేశారు. అందుకే జూబ్లీహిల్స్ ప్యాలస్‌లో లేదా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నించడంతో రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తప్పు చేసినందుకే సీఎం సహా అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, దాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలను రెండు మూడు రోజులకు పరిమితం చేయకుండా కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వానికి 10 వేల కోట్ల అప్పు ఇప్పించిన మధ్యవర్తికి 180 కోట్ల కమిషన్ ఇచ్చామని అసెంబ్లీలోనే చెప్పడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పదోన్నతుల కోసం సీఎం మెప్పు కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీస్ అధికారులను హెచ్చరించారు. తమపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై రాజకీయ విమర్శలు మరో స్థాయికి చేరాయి. గతంలో అధికారులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినవాళ్లే ఇప్పుడు బాధితులమంటూ మాట్లాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లాంటి చర్యలు ముఖ్యమంత్రి లేదా మంత్రి స్థాయి నుంచి ఒత్తిడి లేకుండా జరగవని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు మొదలుపెట్టిందే గత ప్రభుత్వం అన్న వాదనను కూడా పలువురు తెరపైకి తెస్తున్నారు.
మరోవైపు ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం సబబేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని విమర్శిస్తూ, పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చాలని సూచించారు. పెద్ద పారిశ్రామికవేత్తలు, నాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ వల్ల అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. తనతో పాటు పలువురు అగ్ర నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై టిడిపి నేత బక్కన్ నరసింహులు స్పందిస్తూ, కేసీఆర్ తన కూతురు కవిత ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు ఎవరు చేసినా పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల మధ్య ప్రధాన ఆయుధంగా మారింది. ప్రజా సమస్యలు పక్కనపెట్టి కేసులు, అరెస్టులు, ప్రతివిమర్శల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సిట్ విచారణ ఎటువైపు మలుపు తిరుగుతుందో, నిజంగా ఎవరి పాత్ర ఏమిటో బయటపడుతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.

