బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.
నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే ఇది ముష్టి వేసినట్టేనని విమర్శించారు. ఈ మొత్తం విద్యార్థుల అవసరాలకు ఏమాత్రం సరిపోదన్నారు.
విడుదల చేసిన నిధుల్లో ఎస్సీ విద్యార్థులకు రూ.191.63 కోట్లు, ఎస్టీ విద్యార్థులకు రూ.152.50 కోట్లు కేటాయించగా, బీసీ విద్యార్థులకు కేవలం రూ.21.62 కోట్లు మాత్రమే ఇవ్వడం అత్యంత దారుణమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఉండగా, అందులో 18 లక్షల మంది బీసీ విద్యార్థులేనని గుర్తు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందక గత నాలుగేళ్లుగా బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దాంతో వారు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ, బీసీ విద్యార్థులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. అయినప్పటికీ బీసీ సంక్షేమ శాఖ, బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై మౌనం వహించడం సిగ్గుచేటని దుర్గయ్యగౌడ్ విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ, బీసీ విద్యార్థులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. అయినప్పటికీ బీసీ సంక్షేమ శాఖ, బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై మౌనం వహించడం సిగ్గుచేటని దుర్గయ్యగౌడ్ విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, విద్య కోసం రూ.10 వేల కోట్లు కేటాయించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎక్సైజ్ ఆదాయం, భూముల అమ్మకాలు, కార్పొరేట్ సంస్థల నుంచి వేల కోట్ల ఆదాయం వస్తున్నా, పేద విద్యార్థుల చదువుపై ఖర్చు పెట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.
వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించకపోతే, విద్యార్థులతో కలిసి సచివాలయం వరకు భారీ ర్యాలీ చేపడతామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ హెచ్చరించింది. బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించబోమని స్పష్టం చేసింది.

