శాసనసభ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తోంది – స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనసభ సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.

బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, శాసనసభలో అమలు చేస్తున్న అజెండాకు ఏమాత్రం పొంతన లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. BACలో ఏడు రోజుల పాటు అసెంబ్లీ నడపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, సభలో మాత్రం “ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ నిర్ణయం” అంటూ భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు.

మూసీ నది అంశంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి గంటన్నర సేపు మాట్లాడటం సభ్యుల హక్కులను కాలరాసినట్టేనని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నప్పటికీ, స్పీకర్ ఆయనను ఆపేందుకు ప్రయత్నించలేదని పేర్కొన్నారు.

ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, ముఖ్యమంత్రి విమర్శలు చేయొద్దని స్పీకర్ ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పార్లమెంటులో ప్రధానమంత్రి పై విమర్శలు జరుగుతుంటే, రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పై మాట్లాడే హక్కు ఎందుకు ఉండదని ప్రశ్నించారు.

మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్ల కూల్చివేతకు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వకపోవడానికే తమ అభ్యంతరమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. మూసీకి సంబంధించి ఎస్సీపీల నిర్మాణాలు, ప్రాజెక్టుల ప్రతిపాదనలు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు అసెంబ్లీ స్థాయికి తగవని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చిందని, బిల్డింగ్ పర్మిషన్లు, యూసీ, ల్యాండ్ కన్వర్షన్‌లలో కమిషన్ల వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు.

స్పీకర్ పక్షపాత వైఖరి, సభను ఏకపక్షంగా నడిపిన తీరుకు నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *