తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం నేడు బీసీ రిజర్వేషన్ల చుట్టూ మండి పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు విచారణ సందర్భంగా బీసీ మంత్రులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు.
ప్రభుత్వ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింగ్వి వర్చువల్గా వాదనలు వినిపించనున్నారు. జీవో నెంబర్ 9 న్యాయపరంగా బలంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేశారు. కులగణన సర్వే ఆధారంగా ఎంపిరికల్ డేటా సేకరించి రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని ప్రభుత్వం వాదనగా చెబుతోంది.
హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా సుప్రీం కోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఇక ఈ కేసులో పిటిషనర్లు జీవో 9 ద్వారా రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని వాదిస్తున్నారు. సెప్టెంబర్ 27న వాయిదా పడిన విచారణను ఈరోజు (అక్టోబర్ 8) హైకోర్టు తిరిగి పరిశీలించనుంది.
హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు దారితీసే మార్గం సుగమం అవుతుంది. కానీ ప్రతికూల తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది.
ఈ పరిణామాల మధ్య రాష్ట్ర రాజకీయ వర్గాలు, బీసీ సంఘాలు, నాయకులు మొత్తం దృష్టి హైకోర్టు తీర్పుపై కేంద్రీకృతమైంది. బీసీలకు ఇది ఒక “బిగ్ డే”గా మారింది.

