హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన మరో సంచలన రేటు రాయదుర్గంలో నమోదైంది. ఇటీవల ప్రభుత్వ భూముల వేలంలో ఎకరానికి దాదాపు ₹177 కోట్లకు భూమి అమ్ముడుపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అంటే ప్రతి చదరపు గజం ధర ₹3.75 లక్షలు అన్నమాట! ఈ రేటు హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది.
రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్ పరిధిలో జరిగిన ఈ వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. నిపుణుల ప్రకారం, ఇది హై-రైజ్ బిల్డింగ్‌లు నిర్మించగల ప్రాంతం కావడంతో అంత భారీ ధర పలికిందని చెబుతున్నారు. అక్కడ ప్రతి ఎకరంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం సాధ్యమవుతుంది. అంటే ఒక్క గజానికి సుమారు 100 చదరపు అడుగుల నిర్మాణం.
అదే పక్కనే ఉన్న చిన్న స్థలాల్లో, 5–6 అంతస్తుల నిర్మాణానికే అనుమతులు ఉంటాయి. అక్కడ ఒక్క గజానికి కేవలం 25–30 చదరపు అడుగుల నిర్మాణమే సాధ్యం అవుతుంది. అందుకే రాయదుర్గంలో వేలంలో పలికిన ₹3.75 లక్షల గజ ధర సాధారణ ఫ్లాట్లకు లేదా చిన్న ఇండ్ల స్థలాలకు వర్తించదని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అంటున్నారు.
అదే రీతిగా, పక్కనున్న చిన్న బిట్ల ధరలు మాత్రం 50–60% వరకు పెరగొచ్చని నిపుణుల అంచనా. ఈ వేలం రియల్ ఎస్టేట్ మార్కెట్‌కి ఊపునిచ్చినప్పటికీ, మధ్యతరగతి కుటుంబాల కోసం భూమి కొనుగోలు మరింత కష్టతరమవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కోకాపేట్ భూముల వేలం తర్వాత అక్కడి స్థలాల ధరలు భారీగా పెరిగినట్టే, రాయదుర్గం చుట్టుపక్కల కూడా అదే పరిణామం పునరావృతం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు రాయదుర్గంలో జరిగిన ఈ వేలం రేటుతో పక్కప్రాంతాల భూములు కూడా సాధారణ కొనుగోలుదారుల చేతికి అందని దూరంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.
నగర పరిధిలో భూమి ధరలు ఎగబాకడంతో మధ్యతరగతి వర్గాలు తమ సొంత ఇల్లు కలను నెరవేర్చుకోవడం కష్టసాధ్యమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం విధానాల వల్లా? లేక మార్కెట్ డిమాండ్ వల్లా? అన్నదానిపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

