రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. జీవో 120పై పునఃసమీక్ష కోరిన ధర్మాసనం

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఇకపై ఎలాంటి మెమోలు జారీ చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు విచారణకు అనుమతించింది. సినిమా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పాడూరి శ్రీనివాస్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

విచారణ సందర్భంగా జీవో నెంబర్ 120పై పునఃసమీక్ష చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఈ జీవో అమలులోకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్న నేపథ్యంలో, మార్కెట్ పరిస్థితులు, ధరల పెరుగుదల దృష్ట్యా దీనిపై సమగ్ర సమీక్ష అవసరమని వ్యాఖ్యానించింది.

టికెట్ ధరల పెంపుపై దాఖలైన మరో పిటిషన్‌లోనూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. “మేము కూడా సినిమాలకు వెళ్తాం. టికెట్ ధరలు మాకు తెలుసు” అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇస్తున్నారని కోర్టు ప్రశ్నించింది.

టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయినా పదే పదే మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సినిమా టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన హైకోర్టు, ఆ తర్వాత కూడా పెంపులకు ఎలా అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజాసాబ్ సినిమా యూనిట్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో ₹105, మల్టీప్లెక్సుల్లో ₹132 అదనంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ మెమో జారీ చేసింది. అలాగే జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్‌లో ₹62, మల్టీప్లెక్స్‌లో ₹89 పెంచుకోవచ్చని పేర్కొంది. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే పాత టికెట్ రేట్లు అమల్లోకి వచ్చాయని పిటిషనర్లు తెలిపారు.

ఈ వ్యవహారం వెనుక పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ సినిమాల హీరోలు, నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్టు సమాచారం. జీవో 120ను సవరించి టికెట్ ధరల పెంపునకు కొత్త జీవో తీసుకురావాలని వారు కోరనున్నారని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతుండటంతో, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకుడు సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడుతోందని, రూ.500 నుంచి రూ.2000–3000 వరకు టికెట్ ధరలు ఉండటం అన్యాయమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నిర్మాతలు మొదటి వారం లోపే లాభాలు దండుకుంటున్నారని, ప్రజల సొమ్మును పణంగా పెట్టి ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *