చైనా మాంజాతో చెలగాటం ప్రాణాలకు ప్రమాదమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కత్తికన్నా పదునుగా, సీసం కన్నా లోతుగా శరీర భాగాలను కోసేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బైక్‌పై వెళ్లే వాహనదారులకు ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు.
ఇటీవల ఉప్పల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ నెలలోనే చైనా మాంజా కారణంగా ముగ్గురు నుంచి నలుగురు వరకు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
2016 నుంచే రాష్ట్రంలో చైనా మాంజాపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, అది ఎలా రాష్ట్రంలోకి ప్రవేశిస్తోందన్న అంశంపై లోతైన విచారణ అవసరమని సజ్జనార్ తెలిపారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ అక్రమంగా చైనా మాంజా ఎలా చేరుతోందన్నదే ప్రధాన ప్రశ్నగా మారిందన్నారు. హైదరాబాద్‌లోనే తయారీ జరుగుతుందా? అయితే అనుమతులు ఎవరు ఇచ్చారు? అన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.
చైనా మాంజా ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలు, గాజు పెంకుల మిశ్రమంతో తయారవుతుందని, అది విద్యుత్ తీగలకు తగిలితే కరెంట్ షాక్ ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. రోడ్డుపై కనిపించకుండా ఉండే ఈ మాంజా వాహనదారుల మెడలు, చేతులు, కాళ్లను తీవ్రంగా కోసేస్తోందని తెలిపారు.
నగరంలో ఎక్కడైనా చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అమ్మిన వారితో పాటు వాడిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయించే దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల గచ్చిబౌలి, అఫీజ్‌పేట, కీసర, నాగోల్, మియాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైతు, జర్నలిస్ట్, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి వేళ్లు తెగిపోవడం, ముఖం, భుజం, కాళ్లకు లోతైన గాయాలు కావడం వంటి ఘటనలు కలకలం రేపాయి.
ఇప్పటికే వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాజైబ్ను అరెస్ట్ చేసి, రూ.6.90 లక్షల విలువైన 345 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి పండుగ ముగిసే వరకు, అలాగే జనవరి నెల మొత్తం బైక్‌పై వెళ్లే వాహనదారులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు గమనిస్తే డయల్ 100 లేదా 94906165 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, నిషేధిత చైనా మాంజాను నగరం నుంచి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రజల సహకారం అవసరమని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

