రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదని, తన దగ్గరికి ఫైల్ కూడా రాలేదని చేతులెత్తేయడం ఆశ్చర్యకరమని హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి పరిస్థితి చూస్తే జాలేస్తుందని వ్యాఖ్యానించారు.
“శేఖ ఒకరిది, పెత్తనం మరొకరిది, జీవలు ఇచ్చేది ఇంకొకరు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇది ప్రభుత్వంా? లేక సర్కస్ కంపెనీనా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ వైఖరి మారలేదని విమర్శించారు.
తాను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలు ఉండవని, ఎవరికీ ప్రత్యేక ప్రివిలేజీలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి గతంలో బహిరంగంగా ప్రకటించిన మాటలను హరీష్ రావు గుర్తు చేశారు. అలాంటప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు జారీ చేశారని, మరో సినిమాకు కూడా అదే తరహాలో అనుమతి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుందని అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కట్టారని, సీఎం పేరు మారిందని మరో హీరోను జైలుకు పంపించారని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్లపాటు సీఎంగా ఉన్న సమయంలో సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. అందుకే ఈరోజు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు.
చిల్లర రాజకీయాలు, అహంకారపూరిత నిర్ణయాలతో సినిమా పరిశ్రమను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా వారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరు? ఎవరు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు? అన్న విషయాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఈ టికెట్ రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

