తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. ఎన్నికల కమిషన్ ఈ రోజు నుండి షెడ్యూల్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు ఈ నెల 11వ తేదీ వరకు సమయం ఇవ్వబడింది. పోలింగ్ అక్టోబర్ 23న, కౌంటింగ్ నవంబర్ 11న జరగనుంది.
ఇక బీసీ రిజర్వేషన్ అంశం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. సుప్రీం కోర్టు ఇప్పటికే కేసును హైకోర్టుకి బదిలీ చేసి, అక్కడ తీర్పు వచ్చే వరకు వేచిచూడాలని సూచించింది. హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇవ్వనుంది. జీవి నెంబర్ 9 ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై స్పష్టత రాబోతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకూ వెళ్తామని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ నాయకులు ఈ అంశంపై కీలక చర్చలు జరిపారు. పొన్నం ప్రభాకర్ సహా అనేక మంది మంత్రులు “ఎవరైనా అడ్డుకున్నా 42% రిజర్వేషన్ తప్పక అమలు చేస్తాం” అని తెలిపారు.
అయితే బీజేపీ, రెడ్డి జాగృతి వంటి సంస్థలు 50% రిజర్వేషన్ పరిమితిని మించి 69%కు చేరడం రాజ్యాంగవిరుద్ధమని వాదిస్తున్నాయి. హైకోర్టు తీర్పు బీసీల భవిష్యత్తు, స్థానిక సంస్థ ఎన్నికల దిశను నిర్ణయించనుంది. ఒకవేళ కోర్టు జీవి నెంబర్ 9ను తిరస్కరిస్తే ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం ఉండే అవకాశముంది.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. బీసీలకు న్యాయం జరగాలనే ఆశతో అందరి దృష్టి హైకోర్టు తీర్పుపై కేంద్రీకృతమైంది.

