సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి ముందుగా తీసుకురాకపోవడంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో, ఎనిమిదవ తేదీన మన శంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం మరో మెమో జారీ చేసింది. కానీ ఆ మెమోను వెంటనే పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురాకుండా, హైకోర్టు సంక్రాంతి సెలవులు ప్రారంభమైన తర్వాత అంటే పదవ తేదీన బయట పెట్టినట్లు కోర్టు గుర్తించింది.
ఈ వ్యవహారాన్ని సవాలు చేస్తూ న్యాయవాది దాచేపల్లి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్, జీవో నెంబర్ 120 ప్రకారం సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే తొమ్మిదవ తేదీన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ మెమో జారీ చేయడం, పైగా కోర్టు సెలవుల సమయంలో బయట పెట్టడం అనేది తీవ్రమైన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్–1955 లోని సెక్షన్ 7A ప్రకారం, టికెట్ రేట్లు పెంచే ప్రతిపాదన ఉంటే సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ఆ నిర్ణయాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేస్తే బాధితులు లేదా అభ్యంతరం ఉన్న వారు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఈ నిబంధనలను పాటించకపోవడంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్‌తో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని కూడా సుమోటోగా ఇంప్లీడ్ చేసి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వ పారదర్శకతపై, అలాగే చీకటి ఒప్పందాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన ఈ ఘటన, రానున్న రోజుల్లో సినిమా టికెట్ ధరల నియంత్రణపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

