ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. సిట్ విచారణ పేరుతో వరుసగా బిఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ కావడం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విచారణలు నిజమైన న్యాయ ప్రక్రియలో భాగమా? లేక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులను లెక్కచేయకుండా రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం బిఆర్ఎస్‌దని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పని చేశామని, ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైతుబంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా ప్రజల మేలు కోసం అమలు చేశామని గుర్తుచేస్తున్నారు.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎంక్వైరీల పేరుతో, లీకుల పేరుతో, వ్యక్తిత్వ హననం జరుగుతోందని బిఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైలీ సీరియల్‌లా నడుపుతూ, ఒక రోజు ఆరోపణలు, మరో రోజు వాటిని ఖండించే వార్తలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శిస్తోంది. ఈ వ్యవహారంలో తమ పరువు ప్రతిష్టలకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ అనేది దేశంలో కొత్త విషయం కాదని, దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం గూఢచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయినా ఒకే పార్టీని, ఒకే నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణలు జరగడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరుగుతోంది. ఇది న్యాయపరమైన తుది నిర్ణయానికి దారి తీస్తుందా? లేక రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితమవుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

