తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై హైకోర్టు తీర్పు వెలువడే రోజునే, ముదిరాజుల వర్గం నుండి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ముదిరాజుల సంఘ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతూ, “ప్రభుత్వం బీసీల పేరుతో రాజకీయ జిమ్మిక్లు చేస్తోంది, కానీ వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదు” అన్నారు.
ఆయన వ్యాఖ్యానంలో, “ముదిరాజుల కోసం ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. మా కష్టాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్య, ఉద్యోగాల్లో కనీస రిజర్వేషన్ కూడా అందడం లేదు. 567 గ్రూప్-1 పోస్టుల్లో ముదిరాజుల సంఖ్య ఐదుగురిని దాటలేదు,” అని చెప్పారు.
సురేష్ గారు ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “ముదిరాజులు అత్యధిక జనాభా కలిగిన వర్గం. కానీ బీసీ లెక్కల్లో మాకు కేవలం 7% చూపిస్తున్నారు. ఇది స్పష్టమైన అన్యాయం. రాజశేఖర్ రెడ్డి గారు 15% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నించారు, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు,” అని అన్నారు.
ముదిరాజు సంఘాల నాయకులపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “ముదిరాజులే ముదిరాజులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కాసాని గారు, బండ ప్రకాశ్ గారు లాంటి నాయకులు మాకు ఏం చేసారు? హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చినా సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి మూడు సంవత్సరాలు వృథా చేశారు,” అని ఆరోపించారు.
ఆయన కటువుగా వ్యాఖ్యానిస్తూ, “ఇక ప్రభుత్వమూ కాదు, మేమే మారాలి. ముదిరాజులు ఐక్యంగా ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే మా కులానికి రాజకీయ ప్రాధాన్యం ఎప్పటికీ రాదు,” అన్నారు.
సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ రిజర్వేషన్ వ్యవస్థలో ముదిరాజుల వర్గానికి గల అన్యాయం మరోసారి వెలుగులోకి వచ్చింది. హైకోర్టు తీర్పు ఏమొస్తుందో తెలియదు కానీ, ముదిరాజుల వాణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

