రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపిస్తే సిట్ నోటీసులు పంపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం సిద్ధిపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, తెలంగాణను ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందంటూ పిచ్చి ప్రచారం చేసి తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారంతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు.
ఉద్యోగులు పీఆర్‌సీ కోసం అడిగితే ఏసీబీ దాడులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలేనని ఆయన అన్నారు.
పీఆర్‌సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ అంశాలపై స్పందించిన హరీష్ రావు, వాటిలో చాలా సమస్యలు గత ప్రభుత్వం నుంచే కొనసాగుతున్నాయని, కానీ గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్, రైతుల ఖాతాలు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో నిధులను డైవర్ట్ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హరీష్ రావు హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి దాడులు, నోటీసులనే ఆయుధంగా మార్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

