దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తులం బంగారం రూ.62 వేల స్థాయిని దాటి, రూ.75 వేల దిశగా దూసుకుపోతుండగా, కిలో వెండి ధర రూ.3.75 లక్షలకు చేరి చరిత్ర సృష్టించింది. రెండు లోహాల ధరలు ఒకేసారి ఈ స్థాయికి చేరడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.62,100కు చేరినట్లు ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజులోనే రూ.1,690 పెరిగి రూ.62,830కు చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,500 పెరిగి రూ.55,150 స్థాయిలో కొనసాగుతోంది. వెండి ధరలు కిలోకు రూ.3,75,000గా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రికార్డులను బద్దలు కొట్టింది. సోమవారం తొలిసారిగా ఒక ఔన్స్ బంగారం 5,000 డాలర్లను దాటి 5,092.71 డాలర్ల ఆల్ టైం హైకి చేరింది. అదే సమయంలో వెండి ధర ఒక ఔన్స్‌కు 108 డాలర్లను తాకింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు ఊహించని వేగంతో పెరుగుతున్నాయి.
వివాహాది శుభకార్యాల డిమాండ్, పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్, అంతర్జాతీయ అనిశ్చితులు – ఇవన్నీ కలిసి బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారంపై మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధరలు ఇంకా పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గోల్డ్‌మాన్ సాక్స్ ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి ఔన్స్ బంగారం ధర 5,400 నుంచి 6,000 డాలర్లకు చేరొచ్చని అంచనా వేయగా, బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా అదే స్థాయి అంచనాలు వెల్లడించింది.
దేశీయంగా చూస్తే తులం బంగారం ధర రూ.75 వేల నుంచి రూ.95 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరిస్థితులను బట్టి రూ.లక్ష, అవసరమైతే రూ.రెండు లక్షలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కానీ ఈ పెరుగుదల వెనక అసలు బాధ్యత సామాన్యుడిదే. బంగారం, వెండి ధరలు ఇప్పుడు సామాన్యుడికి మాత్రమే కాదు – కనీసం మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందని స్థాయికి చేరాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే బంగారం కొనాలన్న ఆలోచనే భయంగా మారింది.
ఇదే సమయంలో డాలర్ రేటు కూడా రూ.92కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. రేపు రూ.100 దాటినా, భవిష్యత్తులో రూ.200 అయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదన్న చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘తెలంగాణ 2047 – రైజింగ్’ వంటి నినాదాలు సామాన్యుడికి ఎంత వరకూ ఉపయోగపడతాయన్న ప్రశ్న తలెత్తుతోంది.
బంగారం ధరలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం – ఈరోజు బంగారం, వెండి రెండూ సామాన్యుడి చేతిలోంచి జారిపోతున్న కలలుగా మారాయి.

