మంత్రి భేటీలపై విషప్రచారం తగదు: పాలనపరమైన అంశాల కోసమే సమావేశాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం

మంత్రి భేటీలపై కావాలనే బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక–విద్యుత్ శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. పాలనపరమైన అంశాలపై మంత్రులతో భేటీ అవడాన్ని రహస్య సమావేశాలుగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయన సూచన మేరకే మంత్రులతో సమావేశం అయినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రులు సమావేశమవడం సహజమని ఆయన అన్నారు. బహిరంగంగానే జరిగిన సమావేశాలను ‘సీక్రెట్ భేటీలు’గా ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా మదిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడిన ఆయన, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు పాలన అంశాలపై చర్చించామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సమస్యపై మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌తో సమావేశం అయినట్లు తెలిపారు.

ఫోన్ టాపింగ్ అంశంపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతి ఆరోపణలు లేవని, అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ నేతలు, కొంతమంది పత్రిక యజమానులు కావాలనే తప్పుడు కథనాలు రాస్తూ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తన రాజకీయ జీవితం పూర్తిగా ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి కోసమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు బహిరంగంగా జరిగిన భేటీల్లో తప్పేముందని ప్రశ్నించారు. పాలనను దారి మళ్లించే ఉద్దేశంతో జరుగుతున్న విషప్రచారాలను ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *