తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్పీకర్ న్యూట్రల్‌గా వ్యవహరించాల్సిన సందర్భంలో ఆయన తీరు ఒక పక్షానికే అనుకూలంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేల కేసుల్లో విచారణ పూర్తిచేశారు. ఇందులో ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన పిటిషన్ విషయంలో మాత్రం తీర్పును రిజర్వ్ చేశారు.
ఇదిలా ఉండగా, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అదే రోజు విచారణ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై, మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌పై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు.
దానం నాగేంద్రకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. విచారణ అనంతరం స్పీకర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ పదవి పార్టీలకు అతీతంగా, పూర్తిగా న్యూట్రల్‌గా ఉండాల్సినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కాపాడాల్సిన ఒత్తిడి, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వస్తున్న అభ్యంతరాల మధ్య స్పీకర్ రెండు వైపులా నడుస్తున్నట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇక ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెబుతూనే గతంలో జరిగిన ఎన్నికలు, టికెట్లు, ప్రచారాలపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అంశం, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.
మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్ ఇవ్వనుందని, ఆయన నిర్ణయమే తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించనుందని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

