ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ కావడంతో బీఆర్ఎస్ (పింకీలు) తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడం రాజకీయ డ్రామా తప్ప మరొకటి కాదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఒక తెలంగాణ ఉద్యమకారి పింకీలకు సూటిగా ప్రశ్నలు సంధించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చే సాహసం ఎవరైనా చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిజమైతే, 2023 డిసెంబర్ 4న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం, పరికరాలు–ఫైళ్లను ధ్వంసం చేసి మూసీ నది, వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు.
ప్రతిపక్ష నేతలు, అధికారులే కాదు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన రాచక పాలన ఇది అని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితే స్వయంగా వెల్లడించిందని గుర్తు చేశారు. అప్పుడు గుర్తుకు రాని ఆత్మగౌరవం, సిట్ విచారణ మొదలైన తర్వాత గుర్తుకు రావడమేంటని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పేరులో తెలంగాణ పదాన్ని తీసేసి భారతీయ రాష్ట్రీయ సమితిగా మార్చినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఎటు పోయిందని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, గద్దర్ వంటి తెలంగాణ సాంస్కృతిక ప్రతీకను అవమానించినప్పుడు, ఉద్యమకారులను రాత్రి అరెస్టులు చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
ఈటల రాజేందర్‌పై జరిగిన వేధింపులు, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, యువత ఉద్యోగాలపై అవమానకర మాటలు—ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఆత్మగౌరవం మాట్లాడలేదని విమర్శించారు. అధికార దుర్వినియోగంతో ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలన్న ఆలోచనతో పాలన చేసినవారే ఇప్పుడు నోటీసులు వస్తే తెలంగాణ జాతిపిత అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదని, అధికారంలోకి రావడానికి ముందు చేసిన హామీలను విస్మరించి, కుటుంబ పాలన నడిపారని ఆరోపించారు. నీళ్లు–నిధులు–నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు పరారవడం, ఆధారాలు నాశనం చేయడం అన్నీ నిజమైతే తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ ఆత్మగౌరవ డ్రామాలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని, సిట్ విచారణకు సహకరించాలని, తప్పు చేసినవారు తప్పు ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

