సర్పంచ్ పదవి కోసం కూతురినే హత్య చేసిన తండ్రి.. నిజాం సాగర్ కెనాల్‌లో చిన్నారి దారుణ హత్య

సర్పంచ్ పదవి కోసం ఓ తండ్రి ఏకంగా తన కూతురినే హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదన్న నిబంధనను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఈఆర్పీ క్యాంప్ సమీపంలోని నిజాం సాగర్ కెనాల్‌లో గత నెల 26న ఆరేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఫోటోను సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా, మహారాష్ట్ర మూకేడ్ ప్రాంతానికి చెందిన బంధువులు చిన్నారి వివరాలను గుర్తించారు.

మృతురాలు మహారాష్ట్రలోని కేరూరు గ్రామానికి చెందిన ప్రాచిని కొండమంగలేగా పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి పాండురంగ కొండమంగలే తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి మూకేడ్‌లో సెలూన్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహారాష్ట్రలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులవుతారని తెలుసుకున్న పాండురంగ, మొదట తన కుమారుడిని దత్తత ఇవ్వాలని భావించాడు. అయితే బర్త్ సర్టిఫికెట్ సమస్య కారణంగా అది సాధ్యం కాలేదు.

ఈ క్రమంలో సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి దారుణమైన కుట్రకు తెరలేపాడు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు చూపించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పెద్ద కూతురు ప్రాచినిని బైక్‌పై ఎక్కించుకొని మాయమాటలు చెప్పి నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చాడు. ఎడపల్లి వద్ద ఆమెను బలవంతంగా నిజాం సాగర్ కెనాల్‌లోకి తోసి హత్య చేశాడు.

కేసును చేధించిన పోలీసులు పాండురంగ కొండమంగలేతో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజ్ సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.

సర్పంచ్ పదవి కోసం సొంత కూతురినే బలి తీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాజకీయ ఆశలు మనుష్యత్వాన్ని ఎలా మరిచిపోతాయో చూపించే దారుణ ఉదాహరణగా ఈ కేసు నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *