టికెట్ ఇస్తామన్న హామీపై రప్పించి మోసం చేశారు.. మహిళా నాయకురాలి ఆవేదన

టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో మాట మార్చి తనను అవమానించారని మెట్పల్లి మున్సిపాలిటీ 24వ వార్డు మహిళా నాయకురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేశానని, మహిళలకు అండగా నిలబడి పార్టీ కోసం ప్రచారం చేశానని ఆమె తెలిపారు.

మీడియాతో మాట్లాడిన ఆమె.. “నన్ను నైట్ దాకా కూడా టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారు. ఉదయం 8:30 గంటల వరకూ ఫోన్ చేసి టీఫాం తీసుకుని రమ్మన్నారు. రెండు గంటలు అక్కడే కూర్చోబెట్టారు. చివరికి ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదని, నరసింహారావు చేతుల్లో ఉందని చెబుతున్నారు. ఇది ఎంత అన్యాయం?” అంటూ ప్రశ్నించారు.

తాను ఒక మహిళనని, తన సమస్యల కోసం ఎవరినీ ఆశ్రయించకుండా స్వయంగా నిలబడి పరిష్కారం చేసుకునే వ్యక్తినని చెప్పారు. “ఒక టౌన్ అధ్యక్షురాలు అడిగితే కూడా టికెట్ ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటి? కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి టైం ఇవ్వలేదు. నా చేతిలో ఏమి లేదంటే… మరి ఎవరి చేతిలో ఉందో నాకు అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఐదేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, ఆటో అప్పచెల్లి కార్యక్రమం నుంచి వార్డు స్థాయి ప్రచారం వరకు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నానని వివరించారు. అయినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ మార్చడం మహిళా నాయకుల పట్ల పార్టీలో ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తోందని విమర్శించారు.

ఈ వ్యవహారం స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. టికెట్ల పంపిణీలో పారదర్శకత లేదని, ముఖ్యంగా మహిళా నాయకులకు అన్యాయం జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *