జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలుకాలేదని, అలాంటప్పుడు ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.
“మీరే చెప్తున్నారు—500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాలేదు, మహిళలకు 2500 రూపాయలు రాలేదు, రైతు భరోసా రాలేదు. మరి చెప్పండి… ఓట్లు ఎందుకు వేయాలి?” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, పెన్షన్లు, ప్రసూతి సాయం వంటి పథకాలు నిరంతరంగా అమలయ్యాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయని, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. బతుకమ్మ చీరలు, తులం బంగారం, పెరిగిన పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించడానికే తనపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల కోసం ప్రశ్నిస్తే కేసులు పెడతారా? రైతు బంధు రూ.10,000 ఇవ్వమని అడిగితే తప్పా? పెన్షన్ రూ.4000 చేయాలని అడిగితే నేరమా?” అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని, కేవలం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత మరిచిపోతున్నారని విమర్శించారు.
జమ్మికుంట పట్టణంలో మహిళలకు రూ.60,000 బాకీ, రైతులకు వేల రూపాయల బాకీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీ ఉందని వివరించారు. “ఇంటింటికి బాకీ కార్డు ఇచ్చాం. కాంగ్రెస్ లేదా బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే ఈ కార్డు చూపించి ప్రశ్నించండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, అప్పుడు మాత్రమే ప్రజల సమస్యలపై గట్టిగా పోరాడే బలం వస్తుందని కౌశిక్ రెడ్డి అన్నారు. “మీ కోసం భయపడకుండా పోరాడతా. మీరు నాకు బలం ఇవ్వాలి” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

