తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర హెచ్చరికలు చేశారు. సీఎం పై నోరు జారితే ఊరుకోమని, అలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన బీర్ల ఐలయ్య, అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్‌కు మతి భ్రమించిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పాలనను చూసి తట్టుకోలేక బిఆర్ఎస్ నేతలు అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేటీఆర్‌కు సవాల్ విసిరిన ఐలయ్య, నిజంగా దమ్ము ఉంటే ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అలాగే ప్రతిపక్ష నాయకుడిని ఫార్మ్ హౌస్‌లో కూర్చోబెట్టి కేటీఆర్, హరీష్ రావులు కలిసి కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాల కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో అసెంబ్లీని ఎలా అడ్డుకోవాలో నేర్పించారని ఐలయ్య ఆరోపించారు. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు.
మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రాజకీయ విమర్శలు మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

