ఖమ్మంలో భూదాన భూముల వివాదం: బాధితులకు పట్టాలు పంపిణీ, ఖాళీ చేసిన భూములపై కొత్త ప్రశ్నలు

ఖమ్మం నగరంలో భూదాన భూములపై నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూదాన భూముల్లో నివాసాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 412 మంది భూ బాధితులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు పాల్గొని బాధితులకు పట్టాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం, ఈ 412 కుటుంబాల్లో 311 మందికి స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నారు. మరో 101 మందికి వారి స్వంత గ్రామాల్లో ఇప్పటికే స్థలాలు ఉన్నట్లు గుర్తించడంతో, అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పట్టాల పంపిణీకి సంబంధించి మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో టోకెన్లు కూడా పంపిణీ చేశారు. టోకెన్లు అందుకున్న బాధితులు ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఈ నిర్ణయంపై మరోవైపు అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బాధితులు, స్థానికులు చెబుతున్నదేమిటంటే – ముందుగా పేదల ఇళ్లు కూల్చివేసి వారిని ఖాళీ చేయించారని, ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారంగా మళ్లీ ఇతర ప్రాంతాల్లో ఇళ్లు ఇస్తామని చెప్పడం సరైన విధానం కాదని అంటున్నారు. ముఖ్యంగా ఖాళీ చేయించిన భూమి ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఆ భూమిని ఏ ప్రయోజనం కోసం వినియోగించబోతున్నారు? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

స్థానికుల వాదన ప్రకారం, మొత్తం భూదాన భూమి సుమారు 62 ఎకరాలు ఉండగా అందులో 17 ఎకరాల భూమి మాత్రమే ఖాళీ చేయించారని చెబుతున్నారు. మిగిలిన సుమారు 45 ఎకరాల భూమి పరిస్థితి ఏమిటి? ఆ భూమి ఎక్కడికి వెళ్లింది? ఎవరి ఆధీనంలో ఉంది? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా కొంతమంది బాధితులు ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. “మా ఇళ్లు కూల్చేసి ఇప్పుడు మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెబుతున్నారు. మేము కబ్జాదారులమే అయితే మాకు మళ్లీ ఇళ్లు ఎందుకు ఇస్తున్నారు?” అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లు కూల్చిన అదే స్థలంలో మళ్లీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాధితుల మాటల్లో మరో ఆవేదన కూడా వినిపిస్తోంది. “మేము ఖమ్మంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు మమ్మల్ని మా సొంత గ్రామాలకు వెళ్లమంటే ఎలా వెళ్తాము?” అని వారు అంటున్నారు. కొందరు తమకు చిన్న స్థలం ఉన్నా అక్కడ జీవనం సాగించడం సాధ్యం కాదని చెబుతున్నారు.

ఇక ఈ వ్యవహారంపై స్థానిక రాజకీయ నాయకులపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ తమ సమస్యను పరిష్కరించలేకపోయారని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఖమ్మం భూదాన భూముల సమస్యకు ప్రభుత్వం ఒక పరిష్కారం చూపుతున్నప్పటికీ, ఖాళీ చేయించిన భూమి భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తోంది. బాధితులు మాత్రం తమ ఇళ్లు కూల్చిన అదే స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *