తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కొత్త పార్టీని ఈ నెల 27న, శ్రీరామనవమి సందర్భంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు తన స్వగృహం నుంచే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని జాగృతి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ కొత్త పార్టీ ప్రధానంగా మహిళలు, యువత, సామాజిక న్యాయం వంటి అంశాలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఉద్యమకారులు, మేధావులు, జాగృతి నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపి పార్టీ బలపర్చే దిశగా కవిత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ కొత్త పార్టీపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఉందనే భావన ఉన్నప్పటికీ, ఆ పార్టీ నిజంగా ప్రజా సమస్యలపై పోరాడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, మహిళల భద్రత, ఉద్యోగావకాశాలు వంటి కీలక అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ఉంటేనే ప్రజల విశ్వాసం పొందగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, పార్టీ కేడర్ వ్యవస్థ, నాయకత్వ సామర్థ్యం కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. బలమైన, నిష్పక్షపాత నాయకత్వం లేకుండా కొత్త పార్టీ నిలదొక్కుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాత రాజకీయ ధోరణులు కొనసాగితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీకి అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే స్పష్టమైన దిశ, నిబద్ధత, ప్రజల మధ్య నిత్యం ఉండే నాయకత్వం అవసరమని అంటున్నారు.
మొత్తానికి, కవిత ప్రకటించబోయే ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీ నిజంగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందా? లేక మరో రాజకీయ ప్రయోగంగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

