జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో 23 వేల కొత్త ఓట్లు – ఫేక్ ఓటర్ ఐడీలపై పెద్ద వివాదం

2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.75 లక్షలుగా నమోదు అయింది. కానీ, 2025లో మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికల నిమిత్తం తాజా ఓటర్ల లిస్ట్‌ ప్రకారం ఓట్లు 3.98 లక్షలకు పెరిగాయి. అంటే రెండు సంవత్సరాల లోపలే దాదాపు 23,000 ఓట్లు పెరిగినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

అదే సమయంలో సుమారు 12,000 ఓట్లు డిలీట్‌ చేసినట్లు కూడా కమిషన్ తెలిపింది. అంటే మొత్తంగా చూస్తే, ఓటర్ల సంఖ్యలో దాదాపు 35,000 ఓట్ల మార్పు చోటుచేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ అసాధారణమైన పెరుగుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

🔍 ఫేక్ ఓటర్ ఐడీల పంపిణీ వివాదం

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక నాయకుడు — అధికారిక అభ్యర్థి ప్రకటించకముందే — ప్రజల మధ్య ఓటర్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం మీడియాలో బహిరంగంగా జరిగినదే కాకుండా, కాంగ్రెస్ పార్టీ గుర్తు మరియు జెండాలతో పాటు మైనర్ ఓటర్ల సమక్షంలోనూ జరిగింది.

ఎలక్షన్ అధికారుల ప్రకారం, ఆయన 1000కి పైగా ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు అయింది. ఎన్నికల చట్టాల ప్రకారం, ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేయడం ఎలక్షన్ కమిషన్‌ అధికారం మాత్రమే, రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు అలా చేయడం నేరం.

🏠 ఒకింట్లో 43 ఓట్లు – సంస్కృతి అవెన్యూ వివాదం

వివరంగా పరిశీలన చేయగా, జూబ్లీహిల్స్‌లోని సంస్కృతి అవెన్యూ అపార్ట్‌మెంట్స్‌లో ఒక్క ఇంట్లో 43 ఓట్లు నమోదు అయినట్టు బయటపడింది.
అక్కడ నివసిస్తున్న మహిళ మాట్లాడుతూ —

“ఇక్కడ ఇంతమంది ఉన్నారని నాకు తెలియదు. మేము కొత్తగా ఇళ్లను కొనుకున్నాం, ఇంతకు ముందు ఎవరున్నారు అనేది ఎవరికీ తెలియదు” అని చెప్పారు.

ఇంకొక చోట — బూత్ నెంబర్ 125లో — ఒకే ఇంట్లో 23 ఓట్లు నమోదయ్యాయి. ఆ ఇంటి యజమాని నారాయణ గారు మాట్లాడుతూ,

“నాకు ఈ ఓట్లు ఎవరివో తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నా దగ్గర ఒక్క ఓటే ఉంది” అని చెప్పారు.

కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 32 ఫేక్ ఓట్లు?

తదుపరి విచారణలో, హౌస్ నెంబర్ 118, కాంగ్రెస్ నేతకు చెందిన ఇల్లు అని, అందులో 32 ఫేక్ ఓట్లు నమోదు అయ్యాయని ఆ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

⚖️ ఎన్నికల కమిషన్ స్పందన అవసరం

ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల లిస్టులో మార్పులు, ఫేక్ ఓటర్ ఐడీల పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఓటర్ల లిస్టు తారుమారుకి సంబంధించిన ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *