నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఆహార నాణ్యత లేకపోవడం, శుభ్రత లోపించడం, తాగునీరు అందకపోవడం వంటి సమస్యలపై విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినుల ప్రకారం, హాస్టల్‌లో వండే భోజనం సరిగా ఉడకకపోవడం, కొన్ని సార్లు వారే వండుకోవాల్సిన పరిస్థితి రావడం జరుగుతోందని తెలిపారు. డైనింగ్ హాల్‌లో దుర్వాసన వస్తోందని, వాష్‌రూమ్స్ చెదిరిపోయి ఉన్నాయని, చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయని వారు చెప్పారు.
“నిన్న రెండు మూడు గిన్నెలు అన్నం పారేశారు, ఉడకలేదు. ఎగ్స్ కూడా ఇవ్వలేదు. మా రూమ్ దగ్గర పాము చంపాం, పురుగులు తిరుగుతున్నాయి,” అని ఒక విద్యార్థిని తెలిపింది. హాస్టల్‌లో నీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, బోర్ పనిచేయక స్నానం చేయలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
విద్యార్థినులు బయటకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలన్నా అనుమతించరని కూడా తెలిపారు. హాస్టల్‌లో చనిపోయిన కుక్కను రెండు రోజుల తర్వాత మాత్రమే మున్సిపాలిటీ తీసుకెళ్లిందని వారు అన్నారు.
స్థానిక విద్యా శాఖ అధికారులు, జిల్లా పరిపాలన ఈ అంశంపై స్పందించి విద్యార్థినుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

