కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేయగా, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కూకట్‌పల్లి డిసిపి రితిరాజ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన కాల్ డీటెయిల్స్, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ కోసం మహిళా ఐపీఎస్ అధికారి రితిరాజ్‌ను నియమించారు. ఈ మేరకు అధికారిక మెమో కూడా జారీ చేసినట్లు సమాచారం. కేసు నమోదైన తర్వాత ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఆమె పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిసిపి రితిరాజ్ మాట్లాడుతూ.. “పోక్సో చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి స్టేట్మెంట్ ఇప్పటికే ఒకసారి రికార్డ్ చేశాం. అయితే ఇంకా కొన్ని వివరాలు అవసరమున్నందున మరోసారి ఆమెతో మాట్లాడతాం. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి చట్టపరంగా ముందుకు వెళ్తాం” అని తెలిపారు.
అలాగే నిందితుడు బండి భగీరథ ప్రస్తుతం అందుబాటులో లేడని, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ అతని లొకేషన్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. “అతనిపై ఆరోపణలు నిరూపితమైతే తప్పకుండా అరెస్ట్ చేస్తాం” అని డిసిపి స్పష్టం చేశారు.
ఇప్పటికే పోలీసులు గత రెండు రోజులుగా విస్తృత స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు, ఫోన్ రికార్డులు, సంబంధిత డిజిటల్ ఆధారాలు, ఇతర వ్యక్తుల స్టేట్మెంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసు సున్నితమైనదిగా భావిస్తున్న పోలీసులు దర్యాప్తును అత్యంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇక ఈ వ్యవహారం రాజకీయంగానూ వేడెక్కుతోంది. బీజేపీ కీలక నేత కుమారుడిపై పోక్సో కేసు నమోదవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే పోలీసులు మాత్రం కేసును పూర్తిగా చట్టపరమైన కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోబడబోమని చెబుతున్నారు.
ప్రస్తుతం బండి భగీరథ కోసం గాలింపు కొనసాగుతుండగా, తదుపరి దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

