“నా కొడుకుకు టైం ఇవ్వలేకపోయా”.. భావోద్వేగానికి లోనైన బండి సంజయ్, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు భగీరథ్

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై బండి సంజయ్ తొలిసారి భావోద్వేగంగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్త యాత్రలో మాట్లాడుతూ తన కుటుంబం తీవ్ర మానసిక వేదన ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

“ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. నిజాలు కోర్టులో తేలతాయి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తా” అని Bandi Sanjay Kumar వ్యాఖ్యానించారు.

అయితే ఆయన చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. “జీవితమంతా సమాజం కోసమే పని చేశా. ఏ ఇంట్లో కష్టం వచ్చినా పెద్ద కొడుకులా అండగా నిలిచా. కానీ నా కొడుకుకు టైం ఇవ్వలేకపోయా. జరుగుతున్న పరిణామాలకు తప్పు నాదే.. క్షమించండి” అంటూ బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వ్యాఖ్యలను కొందరు రాజకీయ విశ్లేషకులు పరోక్షంగా బాధ్యత స్వీకరించినట్టుగా అర్థం చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇది తండ్రిగా వ్యక్తిగత ఆవేదన మాత్రమే అంటున్నారు.

హిందూ ఏక్త యాత్రలో మాట్లాడుతూ Bandi Sanjay Kumar తనపై, తన కుటుంబంపై జరుగుతున్న దాడులను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. “ఆనాడు హనుమంతుడికి నిప్పంటిస్తే లంక దహనం అయింది. నేడు నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతి సామ్రాజ్యాన్ని దహనం చేస్తా” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ సందర్భంగా శ్రీరాముడు, హనుమంతుడి ఉదాహరణలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో నమోదైన కేసును దేవతలతో పోల్చడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం Telangana High Court ను ఆశ్రయించారు. తనపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని, తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇప్పటికే భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, విచారణకు హాజరు కావడంలో ఆలస్యం జరుగుతోందని వార్తలు రావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఒకవైపు “తప్పు చేయలేదు” అని చెబుతూనే మరోవైపు ముందస్తు బెయిల్ కోరడం ఎందుకనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మరోవైపు బీజేపీ నేతలకు మహిళల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. “ఇతర అంశాలపై గట్టిగా మాట్లాడే నేతలు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? బాధితురాలి తరఫున ఎందుకు నిలబడటం లేదు?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. పోలీసుల దర్యాప్తు వివరాలు, ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసు రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *