భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో తోపులాటలు, చెప్పులతో దాడులు జరిగినట్లు సమాచారం. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై సామాన్య ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. కొత్త సెక్షన్లు కూడా జోడిస్తున్నారు. ఇలాంటి సమయంలో చట్ట ప్రక్రియ కొనసాగుతుండగానే రాజకీయ పార్టీలు రోడ్లెక్కి పరస్పరం దాడులు, ఆరోపణలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

బాధితురాలికి న్యాయం జరగాలి… నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడాలి… దీనిపై ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో బాధితురాలి భవిష్యత్తును పూర్తిగా రాజకీయ రచ్చగా మార్చేయడం సరైందా అనే చర్చ కూడా నడుస్తోంది. కేసు కోర్టులో ఉండగానే ఎవరు శిక్ష నిర్ణయించాలి, ఎవరు రాజీనామా చేయాలి అంటూ రాజకీయంగా తీర్పులు చెప్పడం సరైన విధానం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఈ అంశాన్ని రాజకీయ అవకాశంగా మార్చుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పార్టీ మరో పార్టీపై దాడి చేయడానికి ఈ కేసును వేదికగా చేసుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన రాజకీయ పార్టీలు… వ్యక్తిగత దాడులు, రాజకీయ లాభనష్టాల కోసం ఇలాంటి సున్నితమైన కేసులను ఉపయోగించుకోవడం బాధాకరమని పలువురు అంటున్నారు.

ఇక బండి సంజయ్ రాజీనామా అంశంపై కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ఆయనపై చర్యలు తప్పవని చెబుతుండగా… మరికొందరు బీజేపీ హైకమాండ్ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉండటంతో తుది నిర్ణయాలు న్యాయస్థానం, విచారణ సంస్థల ఆధారంగానే ఉండనున్నాయి.

మొత్తానికి భగీరథ్ కేసు ఇప్పుడు కేవలం న్యాయపరమైన అంశంగా కాకుండా… తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య మరో పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *