కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తృటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిపాడ్ కాంక్రీట్ ఒక్కసారిగా కుంగిపోవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై రాష్ట్రపతిని వెంటనే కిందకు దించారు.
ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి గాయాలు జరగలేదు. అధికారులు “సురక్షితంగా బయటపడ్డారు” అని స్పష్టం చేశారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబాకు బయలుదేరారు.
ఎలా జరిగింది ఈ ఘటన?
మూలాల ప్రకారం, రాష్ట్రపతి హెలికాప్టర్ మొదట పంబా సమీపంలోని నిలకల్ హెలిపాడ్ వద్ద ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో చివరి నిమిషంలో ల్యాండింగ్ స్థలాన్ని రాజీవ్ గాంధీ స్టేడియానికి మార్చారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి హెలికాప్టర్‌ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.
భద్రతా లోపమా లేదా నిర్లక్ష్యమా?
సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఇది ఒక “టెక్నికల్ ఫెయిల్యూర్” అని అంగీకరించారు. అయితే భద్రతా నిబంధనలను పక్కన పెట్టి చివరి నిమిషంలో హెలిపాడ్ మార్చడం, దానిని సరిగా చెక్ చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి.
రాజకీయ స్పందనలు
కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ తీవ్రంగా స్పందిస్తూ,
“ఇది స్పష్టమైన భద్రతా వైఫల్యం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అన్నారు.
అలాగే “అయ్యప్ప స్వామి దయ వల్లే రాష్ట్రపతికి ప్రమాదం జరగలేదు” అని వ్యాఖ్యానించారు.ప్రజల ప్రశ్న
ఒక రాష్ట్రపతికి ఇచ్చే అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం, తగిన సమీక్ష లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు కేంద్ర భద్రతా విభాగాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇది కేవలం సాంకేతిక లోపమా? లేక భద్రతా వ్యవస్థ వైఫల్యమా? అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

